నేను వైసీపీ కార్యకర్తనే అంటున్న రాపాక
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ కార్యకర్తనేనంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు షాకిచ్చారు. "సీఎం జగన్ నన్ను వైసీపీలో కొనసాగమని చెబుతుంటే మీకు అభ్యంతరం ఏంటి?" అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి రాపాక ఈ వ్యాఖ్యలు చేశారు. రాపాక జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారు. ఆయన సాంకేతికంగా జనసేన శాసనసభ్యుడిగా కొనసాగుతుండగా, ఆయన తనయుడు వెంకటరామ్‌ని మాత్రం వైసీపీలో చేర్పించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. జనసేన వాయిస్‌ను అసెంబ్లీలో రాపాక వినిపిస్తారని.. ఆ పార్టీ అధినేత పవన్ గంపెడాశ పెట్టుకున్నారు. సీఎం జగన్‌పై ఎప్పటికప్పుడు పవన్ విమర్శలు సంధిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా రాపాక జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. ప్రభుత్వానికి దగ్గరవుతూ వస్తున్నారు. అంతేకాదు జగన్‌పై పవన్ ఆరోపణలు చేస్తుంటే... రాపాక మాత్రం జగన్‌పై ప్రశంసలు గుప్పించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో మూడు రాజధానులకు మద్దతుగా బిల్లులు ప్రవేశపెట్టితే.. ఆ బిల్లును వ్యతిరేకించాలని రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ రాశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల బిల్లుకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు జనసేనతో సంబంధం లేన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ‘నేను వైసీపీ కార్యకర్తనే’ అని బాంబు పేల్చారు. అయితే రాపాక ప్రకటనతో జనసేన పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి